Monday, September 6, 2010

తొలగిపో నేస్తమా!!!

మేఘాల మాటు నుండి తొంగి చూడకుమా...
నీ అరకొర వాడి చూపులకు నిలువలేకున్నా...
ఎందున నిలిపినా.. నామనస్సు పరిగీడుతుంది నీయందే...
నిలువని నా మనస్సు నా భవితను భగ్నం చేస్తుంది...

ఇంద్రధనస్సు వర్ణాలకి మయూరిలా నాట్యం చేయకుమా...
నీ వయ్యారి నడక హొయసోయగాలు...
నా మది కదిలికలకు మూలకారణాలు...
నా జీవితపుగమ్యపు వినాశనాలు...

ఆమనిలో కూసే కోయిలవి కాకుమా...
నీమాట, పాటల చతురతకు ముగ్దుడనవుతున్నా....
నీ వలపు తలపులలో..
తల్లి తలంపులను వమ్ము చేస్తున్నా...

వసంతపు పూల అత్తరులను వెదజల్లకుమా...
నీ పరిమళాల మత్తులో చిత్తునవుతున్నా...
ఆ మతి భ్రమణలో...
జీవితపు లక్ష్యాలను చేరలేకున్నా...

కలల ప్రపంచములో తేలియాడితే...
నాన్న కలలు కల్లలవుతున్నాయి...
అమ్మ ఆశలు అడియాశలవుతున్నాయి...
అస్థిర జీవిత పయనమవుతుంది...
అందుకే తొలగిపో..
నా హృదయం నుండి తొలగిపో నేస్తమా...



Sunday, September 5, 2010

సుప్రభాతం చూద్దాం రండి....


రండి రండి కదలి రండి నే చెప్పే మాటలకు నా వెనుక రండి...
లక్ష్యాల, గమ్యాల సాధనకు పరుగీడుతూ ముందుకురండి...
కనిపించే ముల్లులను, కనిపించని ముల్లులను దాటుకుంటూ రండి...
పూలబాట వెదుకులాటకు సాగిరండి....
క్షణికావేశానికి లోనుకాక మధుమాసం కోసం చూడండి...
వివేకవంతులై వసంతంని వెదకండి...
బేల, బిత్తర చూపులు విడిచి అభయంగారండి...
దొరకనిది చేదుగా తలచి...
దొరికినది మధురంగా భావించి ముందుకురండి...
సందేహించకు నేస్తమా!!
బాధపడకు మిత్రమా!!
నా చేయి అందుకొనుము, నా పిలుపు వినుము,
నీ బాధ పంచుకొనుము.....

హృదయం పిండిన విషయమైన...
మనస్సుని ముంచిన సారాంశమైన...
జగము అల్లకల్లోలమైన...
కలలు కరిగి పోయినా....

కోరికలు నెరవేరకపోయినా...
తూట్లు పొడిచే మాటలు పడినా...
తల ఎత్తుకోలేని అవమానం కలిగినా...
తీవ్రమైన తిరస్కారం ఎదురైన...
పాతాళంలోకి కూరుకుపోతున్నా...
మిన్నువిరిగి మీద పడినా...
కాలనాగుల విషవలయంలో చిక్కుకున్నా...
ఆశలు అడియాసలైనా...
అనుకున్నది సాధించలేకపోయినా...
అంగవైకల్యం ఏర్పడినా...
ఆస్తి నష్టం వాటిల్లినా...
అయినవాళ్ళు అందరూ పోయినా...
మొదటి మెట్టునుండి మళ్లీ మొదలీడుదాం...
చిరుదివ్వెలను వెలుగించుదాం...
ఆత్మహత్యా ప్రయత్నాలని సమాధి చేద్దాం...
జీవితపు చివరి అంచుల వరకూ పయనిద్దాం...
సుప్రభాతం కొరకు వేచి చుద్దాం రండి..

(ఇటీవల 07/08/2010 న ఆత్మహత్య చేసుకొని మరణించిన మా విద్యార్థికి
కవితా నివాళులు అర్పిస్తూ, అక్కడేవుండి ఏమి చేయలేని నా
అసమర్ధతకు చింతిస్తూ,ఇంకెవరు ఆ ప్రయత్నం చేయకూడదు
అని ఆ దేవున్ని ప్రార్థిస్తూ మీ మధు.)